తెలంగాణలో రాజకీయం గరం..గరంగా…మూడు సవాళ్లు…ఆరు జోష్యాలతో సాగుతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రచారం జోరందుకుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. విమర్శలు..ప్రతి విమర్శలు సహజమే. ఎన్నికల వేళ ఇలాంటి సవాళ్లు..ప్రతి సవాళ్లు..గమ్మత్తు ప్రచారాలు..ఊహాజనిత వార్తలు ఇలా అనేక అంశాలు కన్పిస్తూనే ఉంటాయి. అయితే ఆశ్చర్యకరంగా తెలంగాణలో ఇలాంటి లక్షణాలన్నీ ఇప్పటినుంచే మొదలయ్యాయి. అధికార ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటు న్నారు కావున అదిగో ముందస్తు ఎన్నికలు..ఇదిగో ముహూర్తం ఫిక్స్ అంటూ కొన్ని మీడియా సంస్థలు తెగ హడావిడి చేస్తున్నాయి. అంతర్గతంగా పార్టీల పెట్టుబడితో నడిచే కొన్ని మీడియా వర్గాలు అదిగో పీకే సర్వే..ఇదిగో ఇంటిలిజెన్స్ సర్వే..అంటూ ఆ పార్టీకి ఇన్ని సీట్లు..ఈ పార్టీకి అన్ని ఓట్లు అంటూ విపరీత జోష్యాన్ని చెబుతున్నాయి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే ప్రశాంత్ కిశోర్ రాష్ట్రంలో సర్వే చేశారనేదానికి ప్రమాణికత లేనేలేదు. పికెతో కెసిఆర్ సర్వే చేపించారని ఆ సర్వేలో టిఆర్ఎస్ ఓటమి బాట పడుతుందని తేలిందని కొన్ని ఊహాగాన వార్తలు వస్తున్నాయి. అసలు రాష్ట్రంలో పికె టీం సర్వే చేసిందనేదే వట్టి ప్రచారం మాత్రమేనని కొందరంటున్నారు. అదేవిధంగా సర్వేలో ఓటమి చెందుతున్నట్లుగా తేలింది కావున సిఎం కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారనే కట్టు కథనాలను కొన్ని వర్గాలు ప్రచారం చేపడుతున్నాయి. ప్రభుత్వంలో బదిలీలు సహజం.. ప్రారంభోత్స వాలు అంతకన్నా సహజం.కొత్త పథకాలను ప్రవేశపెట్టడం పాలనలో భాగమే. అదిగో కెసిఆర్ నూతన కలెక్టరేట్లను ప్రారంభిస్తున్నారు.. ఇదిగో టిఆర్ఎస్ కార్యాలయాలను ఓపెనింగ్ చేస్తున్నారు…అల్లదిగో కెసిఆర్ పుట్టినరోజు వేడుకల్లో టిఆర్ఎస్ నేతలు పాలుపంచుకుంటున్నారు..ఇదంతా ముందస్తు ఎన్నికల కోసమేనని అర్థం లేని వాదాలను కొంతమంది, కొన్ని మీడియాలు బిగ్ బ్రేకింగ్ పేరిట అసెంబ్లీ రద్దు..ముహుర్తం ఫిక్స్ అంటూ గాలిని పోగేసి కథనాలను వండటం రాష్ట్ర రాజకీయాల్లో విపరీత పరిణామంగా కన్పిస్తోంది. ఒకవేళ పికె టీం సర్వేలో టిఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు బాగాలేదని ప్రజలు అనుకుంటున్నారని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని తేలినప్పుడు ఎవరైనా ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళతారు.తమ ప్రభుత్వ తప్పొప్పులను సరిచేసుకుంటారు తప్ప ఇంకా రెండేళ్ల పైన ఉన్న అధికారాన్ని వదులుకుంటారా? అలాంటి వ్యూహాన్ని అమలు చేయడానికి కెసిఆర్ ఏమైనా సాధారణ రాజకీయ నేతనా? వ్యూహాలు అమలు చేయడంలో నేర్పరి అయిన కెసిఆర్ తమ ప్రభుత్వ పనితీరును ఉన్న కాలంలో మెరుగుపర్చుకుని మరిన్ని జనాకర్షక పథకాలను ప్రవేశపెట్టి లోపాలను సరిచేసుకుంటారు. ఈ పని ఆ స్థానంలో ఎవరున్నా చేస్తారు. అంతే తప్ప ముందస్తు ఎన్నికలకు వెళ్ళి అధికారాన్ని కోరి కోల్పోరు కదా? మరి డిసెంబర్లో ముందస్తు ఎన్నికలంటూ ఎందుకు ప్రచారం చేపడుతు న్నారోనని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. పూటకో సంచలనాల పేరిట ఏదో హడావిడి చేసే కొన్ని మీడియా సంస్థల అవివేక రాతలతో రాష్ట్రంలో ప్రజాసమస్యలు తెరమీదకి రాకుండా నిత్యం ఇలాంటి కల్పిత కథనాలతో ప్రజల దృష్టి మరల్చే ప్రేరేపిత పాత్రికేయానికి పాల్పడటంపై పలువురు సీనియర్ పాత్రికేయులు మండిపడుతు న్నారు. ఇలా కొనసాగితే జర్నలిజానికి ప్రజల్లో ఉన్న విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదిగో పులి..ఇదిగో తోక అంటూ రాసే కథనాలు రాను రాను ప్రజల్లో పాత్రికేయ వృత్తి ప్రతిష్ఠని మసకబారేలా చేస్తోంది. కేవలం సంచలనాల కోసమే కథనాలను వండివారుస్తున్న కొన్ని ప్రేరేపిత, స్పాన్సర్డ్ జర్నలిజం మీడియాలతో అసలు సిసలు పాత్రికేయానికి ముప్పు ఏర్పడిరదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో మార్పు రాకపోతే భవిష్యత్‌లో జర్నలిజం అంటే కేవలం జోతిష్యాలకే పరిమితం అయి ప్రజాసమస్యలు మరుగున పడే పరిస్థితి దాపురిస్తుందని వారంటున్నారు.
నిత్యం రాజకీయాలేనా?: సవాళ్లు..ప్రతి సవాళ్లు..ముందస్తు జోష్యాలు వీటితోనే రాష్ట్రంలో రాజకీయం నడుస్తోంది. అటు ప్రభుత్వ ఇటు ప్రతిపక్షాలు ఇదే తరహా రాజకీయాలకు పాల్పడుతూ ప్రజాసమ స్యలను గాలికొదిలేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతు న్నాయి.ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఉద్యోగాల ఖాళీలు భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు నిరుద్యోగులుగానే మిగిలిపోతూ జీవిత కాలాన్ని పూర్తి చేసుకుంటు న్నారు. పల్లెల్లో కేవలం ప్రకృతి వనాలు, శ్మశాన వాటికల పనులు తప్ప పల్లెల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో పల్లెవాసుల్లో నిర్వేదం నెలకొన్నది. కొత్త ఫించన్లు రాక అర్హులెందరో అదిగో పింఛను ఇదిగో వచ్చే అంటూ ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా కరోనా మూలంగా లక్షలాది మంది చిరుద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇలా చెప్పుకుంటూపోతే అనేక సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. అంతెందుకు కరోనా మూలంగా పాత్రికేయుల జీవితాలు కూడా ఆగమాగం అయిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఎన్నికలకు ఇంకా రెండేళ్లపైనే సమయం ఉన్నప్పుడు ఇలాంటి ప్రజాసమస్యల పరిష్కారానికి అర్థవంతమైన పోరాటాలు చేసే బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంటుంది. ప్రతిపక్షాల పోరాటాలకు స్పందించి ఆయా సమస్యల పరిష్కారాకి ప్రభుత్వాలు కృషి చేస్తాయి. కానీ దురదృష్ట వశాత్తు అలాంటి పరిస్థితి రాష్ట్రంలో కన్పించడంలేదు. అన్నింటికన్నా ముఖ్యంగా ఇలాంటి విషయాలపై దృష్టి నిలపాల్సిన కొన్ని మీడియా సంస్థలు తమ పరిధి దాటి కేవలం తమ స్వలాభ వార్తలకే ప్రాధాన్యత ఇచ్చి ప్రజాసమస్యలను పాలకులు,ప్రతిపక్షాలు గాలికొదిలేయడంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి.
ముందస్తుకు ఎందుకు వెళతారు?: సర్వేలు నిజంగా జరిగి ఉంటే ఆ సర్వేల్లో కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేక ఫలితాలు వచ్చిన సంద ర్భంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఛాన్స్ ఎంత మేర ఉంటుందనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. అంటే తమ పరిస్థితి బాగోలేదు కనుక ఇప్పుడు ఎన్నికలకు వెళితే ప్రతిపక్షాలు బలం పుంజుకోలేదనే ఉద్దేశ్యంతో ముందస్తు ఎన్నికలకు వెళతారని కొందరు విపరీత ప్రచారం చేస్తున్నారు. అంటే తమ పరిస్థితి ఇప్పుడు బాగా లేనప్పుడు పరిస్థితిని మెరుగుపర్చుకోవడానికి మరో రెండున్నర సంవత్సరాల కాలపరిమితి ఉంది. ఇది చాలా పెద్ద సమయం. మరి విజ్ఞత కల రాజకీయ నేత ఎవరైనా ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో లోపాలను సరిచేసుకుని మరిన్ని జనాకర్షక పథకాలు ప్రవేశపెట ్టడంతోపాటు ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అన్ని హంగులు సమకూర్చుకుంటారు. మరి అలా కాకుండా ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళతారనే ప్రశ్న ఇప్పుడు పలువురిని వేధిస్తోంది. తమ పరిస్థితి ఇప్పుడు బాగాలేదు..మరింత కాలం గడిస్తే ప్రతిపక్షాలు బలపడతాయి. తమ లోపాలను ఎండగట్టి ప్రజావ్యతిరేకతను సొమ్ము చేసుకుంటాయి అందుకే ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళదాం..దీంతో గెలుపు మనదే అని కెసిఆర్ అనుకుంటున్నారని ఆయా వర్గాల ప్రచారం చేపట్టాయి. ఈ ప్రచారంలోని హేతుబద్దతను పరిశీలిస్తే… ముందస్తు ఎన్నికలకు ఏదైనా సానుభూతి పవనాలు వీచే సందర్భంలో వెళ్ళడం రాజకీయాల్లో సాధారణ వ్యూహం. మరి ఇప్పుడు కెసిఆర్ మీద లేదా ప్రభుత్వం మీద ఎలాంటి సానుభూతి లేదు. రెండుసార్లు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజావ్యతిరేకత ఉండటం సహజ పరిణామమే. అది ముందస్తుకు వెళ్ళినా..పదవీకాలం తీరిన తరువాత ఎన్నికలకు వెళ్ళినా అలానే ఉంటుంది. ప్రజా వ్యతిరేకత తీవ్రత స్థాయిలో మార్పు ఉంటుంది. అయితే గమ్మత్తుగా కొన్ని మీడియా సంస్థలు సర్వేల పేరిట లెక్కలు వేస్తూ టిఆర్ఎస్కు 20కి మించి సీట్లు రావని గ్రాఫిక్‌లతో ప్రచారం చేస్తున్నాయి. అంటే ప్రజావ్యతిరేకత తీవ్రత మోతాదు మించి ఉన్నదని దీనర్థం. మరి ఇంత ప్రజావ్యతిరేకత ఉన్నప్పుడు తాము గెలవమని తెల్సినప్పుడు కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళతారనే ప్రశ్నకు ఆయా మీడియా సంస్థలే సమాధానం చెప్పి ఉంటే అర్థం ఉండేది. వీళ్ళే ప్రభుత్వ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నదని..రెండంకెల సీట్లు రావని వీళ్ళే అంకెలు వేసి రాస్తారు..మళ్లీ వీళ్ళే ముందస్తు ఎన్నికలంటూ అదిగో ముహుర్తం ఫిక్స్ అంటూ బిగ్ బ్రేకింగ్‌లు వేస్తారు. ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పుడు ఉన్న రెండున్నరేళ్ల అధికారాన్ని పూర్తిగా అనుభవించి మరింతగా ప్రజల్లో బలపడటానికి ఉన్న కాలాన్ని ఉపయోగించుకుంటారు కానీ ముందస్తు ఎన్నికలకు పోయి అధికారాన్ని ఎవరు కోల్పోవడానికి ఇష్టపడతారు? ఈ ప్రశ్నకు కూడా ఆయా వర్గాల మీడియా సమాధానం చెబితే బాగుంటుంది. అయితే ఇవేవీ ఆయా కథనాల్లో ఉండవు. అందుకే అలాంటి కథనాలన్నీ హేతుబద్దత లేని అత్యుత్సాహ..ఊహాజనిత విశ్వసనీయత లేని పాత్రికేయంగానే చెప్పవచ్చు.
మోడీ సహకారం లేనిదే ముందస్తుకు వెళ్ళడం అసాధ్యం
ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా అంతర్గతంగా కేంద్రప్రభుత్వ సహకారం తప్పనిసరి. ఎన్నికల వ్యవహారాలు చూసే బాధ్యత స్వతంత్ర సంస్థ ఎన్నికల సంఘానిదే అయినా కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిది కుదిరేపనికాదని అందరికీ తెల్సిందే. మరి అలాంటప్పుడు ప్రస్తుతం ఉప్పు నిప్పుగా ఉన్న కెసిఆర్, మోడీ మధ్య లోపాయికారీ అవగాహన ఉంటే తప్ప ముందస్తు ఎన్నికలు కుదిరేపని కాదు. 5 సంవత్సరాల కాలపరిమితికి ప్రజా తీర్పు ఇచ్చి వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో ఎన్నికలు నిర్వహించినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలకు వెళ్ళడాన్ని ఎవరూ హర్షించరు. అదీకాక ‘ఒక దేశం…ఒక ఎన్నిక’ అనే విధానంపై ప్రధాని మోడీ కసర్తు చేస్తున్నారు. ఇలా చేస్తే లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతుంది. మరి ఇలాంటి గొప్ప ఆలోచన చేసే సమయంలో ఎప్పుడుపడితే అప్పుడు ఎన్నికలకు వెళ్ళడం..దానికి ప్రధాని మోడీ సమ్మతిస్తారనే ప్రచారం వట్టిదే. అయితే ఇలాంటి ప్రచారాలు చేపట్టడం వెనక కొన్ని సార్లు ప్రభుత్వమే కావాలనే లీకులు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ప్రజల ఆలోచనా విధా నాన్ని కొన్ని సమస్యల నుంచి పక్కకు మళ్ళించడంతోపాటు తాము అనుకున్న విషయంపై ప్రజల్లో స్పందన ఎలా ఉన్నది? అనే అం శాన్ని ఆరా తీయడానికి కూడా ఇలాంటి లీకులు ప్రభుత్వ వర్గాలే ఇస్తుంటాయి. బహుషా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారం కూడా అలాంటిదే అయి ఉంటుందనే ప్రచారం కూడా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ప్రజాసమస్యలు గాలికొదిలేసి గరం..గరం రాజకీయాలకే అన్ని వర్గాలు మొగ్గు చూపుతున్నాయి. ఇది నిజంగా ప్రజలకు చేటు చేసే అంశమే.
ఊహాజనిత వార్తలు
RELATED ARTICLES