(కె.ఆర్‌)
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్‌ఎఫ్‌సిఎల్‌లో కొందరు దళారులు, ముఖ్య రాజకీయ నేతల పాపానికి నిండు ప్రాణం ఒకటి నేడు గాల్లో కలిసింది.ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల పేరిట ఒక్కొక్క నిరుద్యోగి నుంచి రూ.ఏడు లక్షల నుంచి రూ.15 లక్షల రూపాయలు మొత్తం 700 మంది నిరుద్యోగుల నుంచి దాదాపు 50 కోట్ల రూపాయల పైనే కొందరు రాజకీయ నేతలు, దళారులు, యూనియన్‌ పేర్లు చెప్పుకు తిరిగే వారు వసూళ్లకు పాల్పడి తమని మంచి ఉద్యోగం పేరుతో నమ్మించి నట్టేట ముంచారని, తమమకి న్యాయం చేయాలంటూ బాధితులు కొద్ది రోజులుగా రోడ్డెక్కిన విషయం విదితమే. ఎవరు ఎంత రోడ్డెక్కినా, ఎవరెన్ని పోరాటాలు చేసినా బాధితులకు న్యాయం జరగలేదు.ఈ క్రమంలో శుక్రవారం ఉద్యోగం కోసం దళారులకు డబ్బుల్చి మోసపోయిన ముంజ హరీష్‌ అనే యువకుడు సూసైడ్‌ లేఖ రాసి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. అయితే అదృశ్యమైన యువకుడు ముంజ హరీష్‌ శనివారం కమాన్‌పూర్‌ మండలం కేంద్రంలోని ఓ బావిలో శవమై తేలడం కలకలం రేపుతోంది.రామగుండం ఎరువుల కర్మాగారలో ఉద్యోగం కోసం రూ.7లక్షల రూపాయలు అప్పులు చేసి దళారికి ఇచ్చి నిండా మోసపోయానిని తన చావుతోనైనా దళారులు, నేతలు కనికరించి ఆర్‌ఎఫ్‌సిఎల్‌ బాధితులకు న్యాయం చేయాలని మెసేజ్‌ చేసి తనువు చాలించడం కళ్లు చెమర్చే దుర్ఘటన.
నేతలు, అదిష్టానమే కారణం?

తమను ఉద్యోగాల పేరిట మోసం చేసి తమ వద్ద రూ.7 లక్షల నుంచి 15 లక్షల దాకా వసూళ్లకు పాల్పడి నిండా ముంచారని బాధితులంతా నెలల తరబడి నిరసన తెలుపుతూ ప్రజాప్రతినిధులను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నా ముఖ్య ప్రజాప్రతినిధి తమ అనుచరుల ఆగడాలను అరికట్టి బాధితులకు న్యాయం చేయకుండా కేవలం రాజకీయం చేయడంతోనే నేడు ఓ యువకుడు బలవన్మరణానికి కారణమైంది. అదేవిధంగా బాధితులు నెలల తరబడి తాము మోస పోయాం, తమను ఉద్యోగాల పేరిట నిలువునా దగా చేశారని దళారుల పేర్లు నేరుగా బాధితులు చెప్పినా పట్టించుకోవాల్సిన పోలీసులు, ఉన్నతాధికారులు, పార్టీ అధిష్టానం పెడచెవిన పెట్టడం నేటి పరిస్థితికి కారణమైందని చెప్పవచ్చు.ఆరోపణలు వచ్చిన వెంటనే టిఆర్‌ఎస్‌ అధిష్టానం స్థానిక ప్రజాప్రతినిధితోపాటు ఆయన అనుచరులపై వేటు వేసి చర్యలు తీసుకోకుండా ఉపేక్షించడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చేలా చేస్తోంది. ఆరోపణలు వచ్చిన వెంటనే దళారులపై చర్యలు తీసుకోకుండా వారిని ఎలా కాపాడాలనే విషయానికే ప్రాధాన్యత ఇచ్చి బాధితులను కేవలం రాజకీయం కోసమే వాడుకున్న టిఆర్‌ఎస్‌ అధిష్టానం ఈ పరిస్థితికి ఏం సమాధానం చెబుతుందోననే చర్చ మొదలైంది. అలాగే కొందరు ఆర్‌ఎఫ్‌సిఎల్‌ నిరుద్యోగుల గోసను వ్యాపారంగా మలచుకుని వారికి తీరని ద్రోహం చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఉత్తుత్తి వార్తలు చదువుతూ హడావిడి చేసి లోపలంతా దళారులతో రాజీపడి భారీగా డబ్బులు దండుకుని ఆర్‌ఎఫ్‌సిఎల్‌ బాధితుల గోసను తాకట్టుపెట్టిన కొందరు మీడియా ప్రతినిధులు కూడా ఉన్నట్లుగా నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరిగింది. అదేవిధంగా తమ వద్ద అన్ని ఆధారాలున్నాయంటూ హడావిడి చేసి చీకట్లో దళారులతో రాజీపడి నిరుద్యోగలకు తీరని ద్రోహం చేసిన కొందరు యూనియన్‌ నేతలు, రాజకీయ నేతల తీరుపై కూడా రామగుండంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఎందరో మహానుభావులు అయ్యా మాకు న్యాయం చేయండంటూ రోడ్డెక్కితే ఆ అవకాశాన్ని వ్యాపారంగా మలచుకుని తలా ఇంత తీసుకుని చివరికి రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగాల బాధితులను నట్టేట ముంచారు.దీంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో బలన్మరణమే పరిష్కారమని ఆ దిశగా పయనించడం తీవ్రమైన ఆందోళన కల్గించే అంశం. ఇప్పటికైనా రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగ బాధితుల గోసను పట్టించుకుని వారికి న్యాయం చేయడమే కాదు దళారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే వెయ్యి రూపాయల దొంగతం కేసును వేగంగా విచారించి నిందితులను కటకటాల పాలు చేసే మన ప్రజాస్వామ్య దేశంలో ఇంతమంది నిరుద్యోగులను దగా చేసిన దళారులపై ఇంతవరకు ఎలాంటి కేసు నమోదు కాకపోవడం విచిత్ర పరిణామమే.ఆరోపణలు వచ్చిన వెంటనే పోలీసులు సుమోటాగా కేసును స్వీకరించి ఉండి ఉంటే నేడు ఈ పరిస్థితి దాపురించి ఉండేది కాదని అందరూ అంటున్నారు.అలాగే నిజాలు నిర్భయంగా రాయాల్సిన మీడియా బాధితుల పక్షాన ఉండకుండా దళారులకు కొమ్ముకాస్తు వారితో రాజీకుదుర్చుకుని బాధితుల గోసను పట్టించుకోకపోవడం యావత్‌ మీడియా లోకానికే తలవంపులు తెచ్చే విషయం. దీనిపై ఇప్పటికే నలువైపుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.ఈ ఆరోపణలు మీడియా పరువును గంగలో కలపడం పాత్రికేయ వృత్తికే కళంకం అని పలువురు నిఖార్సయిన పాత్రికేయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం నేటినుంచైనా ఆర్‌ఎఫ్‌సిఎల్‌ బాధితులకు అందరూ అండగా ఉడాలి. ఆ దిశగా అందరూ ఆలోచిస్తేనే వారికి న్యాయం దక్కుతుంది. లేదంటే మరెన్నో దుర్ఘటనలను చూడాల్సి వచ్చే ప్రమాదం ఉన్నది.

One thought on “దళారుల దగాతోనే నిండు ప్రాణం బలి?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *