ఎవరా జర్నలిస్ట్‌? ఏంటా కథ?
ఎంఎల్‌ఎ చందర్‌ మౌనం వెనక మర్మం ఏంటి?
పోలీసులు కేసు నమోదు చేస్తారా? మోహన్‌ గౌడ్‌తో సరిపెడతారా?

( కె.ఆర్‌ ఉన్నమాట)
నీతిని వీడకుండా.. నిజాన్ని కప్పిపుచ్చకుండా..పాలకులకు సేవలో తరించకుండా ఉన్నది ఉన్నట్లుగా రాయడమే జర్నలిజం.కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు దాని అర్థమే మారిపోయింది.ఉన్నది ఉన్నట్లుగా రాయడం సంగతి దేవుడెరుగు..జరిగిన నిజాన్నే కప్పిపెడుతూ పాలకులకు దళారులుగా కొంతమంది జర్నలిస్టులు వ్యవహరించడం యావత్‌ పాత్రికేయ ప్రతిష్ఠ నడిబజార్లో మసకబారేలా చేస్తోంది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ నిజమైన ప్రజాస్వామ్య వారధులుగా ఉండాల్సిన పాత్రికేయులు కొంతమంది అడ్డదారులు తొక్కుతూ మొత్తం జర్నలిజం వ్వవస్థనే సర్వనాశనం చేస్తున్నారు. అనేక సందర్భాల్లో ఈ విషయంపై చర్చ నడుస్తూనే ఉన్నది. తాజాగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఓ పాత్రికేయుడు ఆర్‌ఎఫ్‌సిఎల్‌ కొలువుల దందాలో దళారీగా ఉన్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఆర్‌ఎఫ్‌సిల్‌ ఉద్యోగాల దందాలో ఉద్యోగాల పేరుతో దాదాపు 50 కోట్ల రూపాయలు చేతులు మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై చాలా రోజులుగా బాధితులు రోడ్డెక్కి న్యాయం కోసం పోరాడున్నారు. ఇటీవల ఆర్‌ఎఫ్‌సిల్‌లో ఉద్యోగం కోసం లక్షలాది రూపాయలు అప్పుజేసి దళారీలకు ముట్టజెబితే ఆర్‌ఎఫ్‌సిల్‌ కొలువు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిందని దీంతో తను చెల్లించిన డబ్బులు తనకు తిరిగి చెల్లించాలంటూ ఒ యువకుడు సూసైడ్‌ మెసేజ్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అయితే తాజాగా ఇంకో రకం దందా ఆర్‌ఎఫ్‌సిఎల్‌లో జరిగిందంటూ ఆర్‌ఎఫ్‌సిఎల్‌ హమాలీ కార్మికులు స్థానిక శాసనసభ్యుడు కోరుకంటి చందర్‌కు అందించిన ఫిర్యాదు లేఖలో బయటపడిరది. హహాలీ కార్మికులు దాదాపు 120 మంది ఎరువుల కర్మాగారంలో ఉద్యోగం కోసం ఒక్కొక్కరు సుమారు.2 లక్షలు జమ చేసి దఫదఫాలుగా మొత్తం 2 కోట్ల నలభై మూడు లక్షల యాభైవేల రూపాయలు గోపగాని మోహన్‌ గౌడ్‌, గుండు రాజులకు యూనియన్‌ నేత సిహెచ్‌ ఉపేందర్‌, విలేకరి ఎం.వంశీల సమక్షంలో ముట్టచెప్పినట్లు ‘ ది ఫర్టిలైజర్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా హమాలీ లోడర్స్‌ కో ఆపరేటివ్‌హ సొసైటీ’ లెటర్‌ ప్యాడ్‌ మీద రాతపూర్వకంగా స్థానిక శాసనసభ్యుడు కోరుకంటి చందర్‌ కార్యాలయంలో ఫిర్యాదు పత్రాన్ని అందించారు. ఆర్‌ఎఫ్‌సిఎల్‌లో ఉద్యోగాలు చేస్తున్న 120 మంది హమాలీ కార్మికుల్లో 70 మందిని సదరు కంపెనీ పనుల్లో నుంచి తొలగించింది. దీంతో వారు రోడ్డున పడ్డారు. అందుకే తాము చెల్లించిన డబ్బులు తమకు ఇప్పించాల్సిందిగా హమాలీ కార్మిక సంఘం నేతలు ఎంఎల్‌ఎకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా 120 మందిలో రోడ్డున పడ్డ 70 మంది హమాలీ కార్మికులే కాక లోపల ఉన్న కార్మికుల పరిస్థితి కూడా బాగా లేదని కార్మికులు వాపోతున్నారు. నెలకు కేవలం 12 వేల రూపాయలు మాత్రమే అందుతున్నాయని మంచి ఉద్యోగం అని నమ్మి లక్షలాది రూపాయలను అప్పుచేసి దళారులకు ముట్టజెబితే మా పరిస్థితి ఇలా తయారయిందని ఇంకా ఉద్యోగాల్లో కొనసాగతున్న 50 మంది కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఇదంతా తాజాగా ఆర్‌ఎఫ్‌సిఎల్‌ ఎరువుల కర్మాగారంలో తాజాగా బయటపడిన 120 మంది హమాలీ కార్మికుల కొలువుల దందా వ్యవహారం.ఈ వ్యవహారంలోనే దాదాపు 2కోట్ల 43లక్షల యాభై వేల రూపాయలు దళారులకు ఇచ్చినట్లుగా బాధితులు నేరుగా ఫిర్యాదు చేయడం గమనించాల్సిన విషయం. ఇక ఉన్నత స్థాయి ఉద్యోగాల విషయంలో ఒక్కొక బాధితుడి దగ్గర నుంచి దాదాపు 7 లక్షల నుంచి 12 లక్షల దాకా వసూళ్లకు పాల్పడితే ఎన్ని కోట్ల కుంభకోణం జరిగిందనేది అర్థమవుతుంది. బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ గడ్డి కుంభకోణం కన్నా ఆర్‌ఎఫ్‌సిఎల్‌లో కొలువుల దందాలో చేతులు మారిన డబ్బులు ఎక్కువ. పైగా ఇక్కడ సామాన్యులు బాధితులు. వారు తీవ్రంగా నష్టపోయారు. మరి ఇంతటి తీవ్రమైన కుంభకోణంపైన ఇప్పటివరకూ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై మరో వ్యాసంలో చర్చిద్దాం. ఇప్పుడు ఆర్‌ఎఫ్‌సిఎల్‌లో హమాలీ కార్మికులు స్థానిక శాసనసభ్యుడు కోరుకంటి చందర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో ఎవరో విలేకరి, ఏ మీడియానో రాయలేదు..కానీ రిపోర్టర్‌ ఎం.వంశీ అనే పేరును ఉఠంకించడం చర్చకు దారితీస్తోంది. అయితే బాధితులు చెబుతున్న విషయం ఏంటంటే తాము వివిధ తేదీల్లో ఇచ్చిన డబ్బులు గోపగాని మోహన్‌ గౌడ్‌, గుండు రాజులకు ఇచ్చామని అలా ఇచ్చే సందర్భంలో రిపోర్టర్‌ ఎం.వంశీ, యూనియన్‌ నేత సిహెచ్‌ ఉపేందర్‌ సమక్షంలో ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అంతే తప్ప నేరుగా రిపోర్టర్‌, యూనియన్‌ నేతకు తాము డబ్బులు చెల్లించలేదని చెబుతున్నారు. అయితే ఓ అక్రమ దందా సమయంలో సదరు పాత్రికేయుడు ఉండటం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఓ అక్రమ కొలువుల దందా నడిచే వ్యవహారాన్ని తమ కలం ద్వారా బయటపెట్టి తెల్సిన నిజాన్ని సమాజానికి చెప్పకుండా దాచిపెట్టడం పాత్రికయ నైతికతను, నిజాయితీని ప్రశ్నించేలా చేస్తోంది. తాను ఏ మీడియా విలేకరో, ఎవరో తెలియదు కానీ ఇలాంటి వ్యవహారంలో ఓ పాత్రికేయుడి పేరు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వెలుగులోకి రావడం పాత్రికేయ వృత్తికే చీకటి రోజుగా చెప్పవచ్చు. అయితే ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదలు కాదు..ఇదే చివరిది కాదు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉంటాయి.
ఎంఎల్‌ఎ ఏం చేస్తారు?
తనకు ఆర్‌ఎఫ్‌సిఎల్‌ హమాలీ బాధితులు అందించిన ఫిర్యాదు విషయంలో స్థానిక శాసనసభ్యుడు కోరుకంటి చందర్‌ ఏం చేస్తారోననే చర్చ నడుస్తోంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డబ్బులు తీసుకున్న గోపగాని మోహన్‌ గౌడ్‌, గుండు రాజులను ఇప్పటికే అరెస్ట్‌ చేశారు కనుక బాధితులకు డబ్బులు ఇప్పిస్తానని సర్దిచెప్పి కాలం దాట వేస్తారా? లేక ఫిర్యాదులో పేర్కొన్న రిపోర్టర్‌ ఎం.వంశీ, సిహెచ్‌ ఉపేందర్‌ అనే వ్యక్తులపై కేసులు నమోదు చేయిస్తారా? అనే చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది.

పోలీసులు కేసు నమోదు చేస్తారా?

ఆర్‌ఎఫ్‌సిల్‌ బాధితులు శాసనసభ్యుడు కోరుకంటి చందరకు ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టంగా దళారుల పేర్లు, ఎవరి సమక్షంలో ఇచ్చామో, ఏ తేదీల్లో ఇచ్చామో, ఎవరికి ఇచ్చామో పేర్లతో సహా స్పష్టంగా పేర్కొన్నారు.మరి ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారోనేని చర్చకూడా నడుస్తోంది. నిందుతులకు ఏ రకంగా సాయం చేసినా చట్టప్రకారం నేరమని చెప్పే చట్టాలున్నాయి. మరి ఇప్పుడు రెండు కోట్ల నలభై మూడు లక్షల యాభై వేల రూపాయలు దళారులకు కొందరి సమక్షంలో ఇచ్చామని స్పష్టంగా లిఖిత పూర్వకంగా ఓ బాధ్యతగల నియోజకవర్గ ప్రథమ పౌరుడికి ఫిర్యాదు చేసినా పోలీసులు గోపగాని మోహన్‌ గౌడ్‌, గుండు రాజుల మీద ఏ సెక్షన్‌ల కింద నమోదు చేశారో అవే సెక్షన్ల ప్రకారం బాధితులు పేర్కొన్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేస్తారా? లేక తమకు నేరుగా ఫిర్యాదు అందలేదు మేం ఏం చేయాలనే రొటీన్‌ డైలాగ్‌లతో ఆరోపణలు వస్తున్న వ్యక్తులను కాపాడతారా? అనే ప్రశ్న ఇప్పుడు నలువైపుల నుంచి వస్తోంది. ఆర్‌ఎఫ్‌సిల్‌ వ్యవహారంలో ఇప్పటికే పోలీసు శాఖ నలువైపుల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇప్పటికైనా లేఖలో పేర్కొన్న వ్యక్తులను విచారిస్తే మరిన్ని విషయాలు బయటకొస్తాయని అప్పుడే బాధితులకు న్యాయం దక్కుతుందని ఆ దిశగా పోలీస్‌ శాఖ ప్రయత్నించాలని పలువురు అంటున్నారు.

ఒక్క మోహన్‌ గౌడ్‌ని ఇరికించి పెద్ద తలకాయలు తప్పించుకుంటాయా?

ఆర్‌ఎఫ్‌సిల్‌ కొలువుల దందాలో గోపగాని మోహన్‌గౌడ్‌, గుండు రాజు వంటి వారు కేవలం కొన్ని పాత్రలు మాత్రమేనని పలువురు అంటున్నారు. ఈ దందాలో మూడు దశలో వాటాలు చేతులు మారినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ దందా పాపం అంతా ఇటీవల అరెస్ట్‌ చేయబడిన గోపగాని మోహన్‌ గౌడ్‌తోపాటు మరికొంతమందిదేనని పెద్ద తలకాయలు తెలివిగా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. గోపగాని మోహన్‌ గౌడ్‌ అరెస్ట్‌ అయ్యే కొద్ది రోజుల ముందు తనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ చెప్పడం వెనక ఎదైనా సమస్య వస్తే పాపం అంతా నీ మీద వేసి మేం తప్పించుకుని నిన్ను బయటకి తీసుకొస్తామనే అంగీకారం ప్రకారమే నడిచిందనే గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇప్పుడు కూడా హమాలీ కార్మికుల వ్యవహారంలో పెద్ద తలకాయలు తప్పించుకుని కొందరిపైన ఆరోపణలు చేస్తే సమస్య తీవ్రత పక్కదారి పడుతుందనే ఎత్తుగడ ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎంఎల్‌ఎకు ఇచ్చిన ఫిర్యాదు కాపీ మేం ఎవరికీ లీక్‌ చేయలేదు అదెలా బయటకొచ్చిందే తమకు తెలియదని బాధితులు చెబుతున్నారు. అయితే న్యాయం చేయండి అని బాధితులు అందించిన ఫిర్యాదు లేఖను ఎవరు లీక్‌ చేశారనే విషయంపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవతున్నాయి. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి కొందరిని ఈ విషయంలో ఇరికించే వ్యవహారం కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనప్పటికీ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు విషయంపై ఇప్పటికీ స్థానిక శాసనసభ్యుడు కోరుకంటి చందర్‌ మౌనంగా ఉండటం ఎందుకనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా బాధితులు రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం పొందుతున్నా ఇంతవరకూ ఈ విషయంపై అటు పార్టీలు, ఇటు నేతలు, పోలీసులు మౌనంగా ఉండటం బాధితులకు నష్టం చేకూర్చే పరిణామమే.వెంటనే ఈ విషయంపై ఎంఎల్‌ఎ కోరుకంటి చందర్‌ స్పందించి బాధితులకు న్యాయం చేయడంతోపాటు లేఖలో పేర్కొన్న వ్యక్తుల ప్రమేయంపై నిష్పక్షపాత విచారణ చేపట్టినప్పుడే జనం నమ్ముతరు..లేదంటే ఎన్ని సానుభూతి మాటలు చెప్పినా ఉత్తుత్తి ముచ్చటగానే చూస్తరు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే నిష్పక్షపాత విచారణచేపట్టాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *