తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఇక జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారనే ప్రచారాన్ని ఆ పార్టీ నేతలు జోరుగా చేపడుతున్నారు. కెసిఆర్‌ ప్రధాని కావాలని దేశం మొత్తం ఎదురు చూస్తోందని ఆ పార్టీ నేతలు ఎవరో స్క్రిప్టు రాసినట్లుగా చెబుతున్నారు.తెలంగాణ రాష్ట్రసమితి త్వరలోనే భారత రాష్ట్రసమితిగా మారనున్నదని అంటున్నారు. అన్నీ కుదరితే దసరాకు కెసిఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన చేస్తారని అంటున్నారు. దళిత బంధు, రైతు బంధు, ఉచిత విద్యుత్‌ వంటి పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామనే ప్రధాన అజెండాతో కెసిఆర్‌ జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇన్నాళ్ళూ మూడో ఫ్రంట్‌ అని చెప్పిన కెసిఆర్‌ ఇప్పుడు ఏకంగా జాతీయ పార్టీని ఏర్పాటు చేసి మోడీకి ప్రత్యామ్నాయ నేతగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని టిఆర్‌ఎస్‌ నేతలతోపాటు ఆ పార్టీ అనుకూల మీడియా ప్రచారాన్ని నెత్తిన ఎత్తుకోవడంలో ఉన్న రాజకీయ వ్యూహాం ఏంటనే ప్రశ్న వస్తోంది. ఒక తెలుగువాడిగా కెసిఆర్‌ దేశ ప్రధాని కావాలని ప్రతీ తెలుగువారు కోరుకుంటారు. ఇందులో ఎలాంటి తప్పులేదు. అలా కోరుకోవాలి కూడా..అయితే సాధ్యాసాధ్యాలను కూడా విశ్లేషించుకోవాలి. కొన్ని రోజులుగా సిఎం కెసిఆర్‌ దేశ రాజకీయాల్లో ఆసక్తి చూపెడుతున్నారు. వివిధ రాష్ట్రాలు తిరిగి కొందరు నేతలను కలిశారు. మంతనాలు చేశారు. కేంద్రంలో మోడీని ఢీకొట్టాలంటే ప్రాంతీయ పార్టీలు ఐక్యమై జట్టుకట్టే దిశగా కెసిఆర్‌ ప్రయత్నించారు. అయితే కెసిఆర్‌ చాలారోజులుగా కొన్ని రాష్ట్రాల్లో పర్యటించారు..కొద్దిమంది నేతలతో మంతనాలు చేసినా మూడోఫ్రంట్‌ ఎక్కడా ముడిపడలేదు. మూడో కూటమి ఏర్పాటు చేద్దామని ఏ ఒక్క పార్టీ ఇంతవరకూ ముందుకు వచ్చి ప్రకటించలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తీరు ఏంటో అర్థమయింది. దీంతో కెసిఆర్‌ మూడోకూటమి కోసం చేసిన ప్రయత్నం విఫలమైనట్లయింది.అదీకాక ఎన్‌డిఎ కూటమికి ప్రత్యామ్నాయంగా మరో కూటమి జట్టుకట్టాలంటే జాతీయ పార్టీ కాంగ్రెస్‌ వెన్నెముకగా లేనిదే వీలయ్యే పనికాదు. జాతీయ పార్టీ కాంగ్రెస్‌ నేతృత్వంలో యుపిఎ కూటమి అధికార కూటమి ఎన్‌డిఎకి ప్రత్యామ్నాయంగా ఉన్నది. ఇప్పుడు ఈ కూటమిని కాదని మరో కూటమి రూపుదిద్దుకోవాలంటే ఒక జాతీయ పార్టీ వెన్నెముకగా ఉండాలి. అలా జాతీయ పార్టీ వెన్నెముకగా ఉన్న కూటమిలోకి వివిధ ప్రాంతీయ పార్టీలు జట్టుకట్టి బిజెపియేతర, కాంగ్రెసేతర కూటమిగా మూడో కూటమిగా రూపుదిద్దుకోవాలి. అదే థర్డ్‌ ఫ్రంట్‌. ఇప్పుడు ఈ థర్డ్‌ఫ్రంట్‌ కెసిఆర్‌ నాయకత్వంలో ఏర్పాటు చేసి దేశానికి ప్రధాని కావాలని మన తెలంగాణ రాష్ట్రసమితి నేతలు ఆశిస్తున్నారు. వారు ఆశించడంలో ఎలాంటి తప్పులేదు. అయితే బిజెపి, కాంగ్రేతర మూడో కూటమి థర్డ్‌ఫ్రంట్‌ కేంద్రంలో అదీ కెసిఆర్‌ నాయకత్వంలో ఏర్పడుతుందటే అంతకన్నా అతిశయోక్తి మరొకటి ఉండదు. జాతీయ పార్టీని ఎవరైనా ఏర్పాటు చేయవచ్చు..ఎవరైనా జాతీయ రాజకీయాలు చేయవచ్చు. కానీ ఓ దేశ ప్రధాని కావాలంటే సరిjైున లోక్‌సభ సభ్యుల సంఖ్యా బలం ఉండాలి. మరి జాతీయ రాజకీయాలు నడపాలంటే ఇప్పుడు కెసిఆర్‌ దగ్గర ఉన్న లక్‌సభ సభ్యుల బలమెంత? వచ్చే ఎన్నికల్లో ఆ బలమెంత? ఉన్న బలముంటుందా? తగ్గుతుందా? అనే ప్రశ్నలు వేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితులను చూస్తే తెలంగాణలో రాజకీయం త్రిముఖంగా నడుస్తోంది. టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపిల మధ్య హోరాహెరీ పోరు నడుస్తోంది.ఈ పోరులో వచ్చే ఎన్నికల్లో తలా కొన్ని లోక్‌సభ సీట్లు దక్కించుకుంటే టిఆర్‌ఎస్‌కు రెండంకెల సీట్లు కూడా దక్కడం అనుమానమే. ఏడెనిమిది సీట్లతో దేశ ప్రధాని కావడం కుదిరేపనేనా? అదీకాక తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ వివిధ నియోజకవర్గాల్లో ఎదురీదుతోంది. ప్రజావ్యతిరేకత కావాల్సినంత ఉన్నది.ఈ పరిస్థితుల్లో మూడోసారి టిఆర్‌ఎస్‌ అధికారం అందుకోవడం అంత తేలికైన ముచ్చటేమీ కాదు. ఒకవేళ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌కు అధికారం దక్కని పక్షంలో ఆ పార్టీ నుంచి గెలుపొందిన లోక్‌సభ సభ్యులు టిఆర్‌ఎస్‌ పార్టీనే అంటిపెట్టుకుని ఉంటారనే గ్యారెంటీ లేదు. అంటే గెలిచే ఏడెనిమిది లోక్‌సభ సీట్లలో రాష్ట్రంలో అధికారం అందుకోలేకపోతే సగం లోక్‌సభ సభ్యులు గోడదూకక మానరు.మరి ఈ పరిస్థితిలో అటు రాష్ట్రంలో అధికారం లేక ఉన్న రెండు మూడు లోక్‌సభ సీట్లతో కెసిఆర్‌ జాతీయ రాజకీయాల్లో చక్రం ఎలా తిప్పుతారో మేధావులైన రాజకీయ నేతలు చెప్పాలి. ఇక జాతీయ రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ, బిహార్‌ సిఎం నితీశ్‌ కుమార్‌, మహారాష్ట్ర రాజకీయ ఉద్దండుడు శరద్‌పవార్‌లను కాదని సిఎం కెసిఆర్‌ని దేశప్రధాని అభ్యర్థిగా వివిధ పార్టీలు అంగీకరిస్తాయా అనేది ప్రశ్నార్థకం. అసలు కెసిఆర్‌ని దేశ రాజకీయ నాయకుడిగా ఇప్పటివరకూ ఏ ఒక్క పార్టీ ప్రకటించకపోవడం గమనార్హం. కెసిఆర్‌ అయితే వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఓక రాష్ట్ర సిఎంగా ఆయనకు తగిన గౌరవం గుర్తింపు తప్పక దక్కుతుంది. అంతమాత్రాన కెసిఆర్‌కు దేశ వ్యాప్తంగా అనూహ్య మద్దతు దక్కుతోందని, ఆయనే తదుపరి ప్రధాని అంటూ ఊదరగొట్టే ప్రచారం చేపట్టడం హాస్యాస్పదమే. గతంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఇదే ప్రచారాన్ని చేపట్టి బోల్తాపడ్డారు. ఇప్పుడు కెసిఆర్‌ కూడా చంద్రబాబు తరహా రాజకీయాలనే చేపట్టడం విస్తుపోయే అంశమే. అంతెందుకు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో రెండెంకల లోక్‌సభ సీట్లున్న వైసిపి నేత వైఎస్‌ జగన్‌ కూడా ఇంతవరకూ కెసిఆర్‌ ప్రధాని అభ్యర్థిత్వంపై మద్దతు తెలపలేదు. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్నాటకలో కూడా కెసిఆర్‌ నాయకత్వాన్ని బలపర్చిన పార్టీలు లేవు. దక్షిణాది పార్టీలే కెసిఆర్‌ జాతీయ రాజకీయాలకు మద్దతు ఇవ్వనప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో సిఎం కెసిఆర్‌ ఏం చేయగలరు? ఇలా అనేక ప్రశ్నలు కెసిఆర్‌ జాతీయ రాజకీయంపై ఎక్కుపెడితే వచ్చే సమాధానం ఒక్కటే..కెసిఆర్‌ జాతీయ రాజకీయం నేల విడిచి సాము చేసినట్టేనని. అయితే కెసిఆర్‌ జాతీయ రాజకీయం కేవలం జాతీయ రాజీకీయమేనని అనేవారున్నారు. కెసిఆర్‌ జాతీయ రాజకీయ ప్రకటనల వెనక ఉన్న వ్యూహాన్ని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. కెసిఆర్‌ చేసే జాతీయ రాజకీయ హడావిడి అంతా బిజెపి మేలుకోసమేనని విమర్శలు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్‌ వైపు వివిధ ప్రాంతీయ పార్టీలు మళ్ళకుండా బిజెపినే కెసిఆర్‌తో జాతీయ రాజీకీయాలు చేపిస్తోందంటున్నారు. బిజెపి వ్యతిరేక పార్టీలు ప్రధాన పోటీదారుగా ఉన్న యుపిఎ కూటమి వైపు చేరకుండా వ్యూహాత్మకంగా ఇంకో వైపు దారిమళ్ళించాలనే ఎత్తుగడలో భాగంగానే కెసిఆర్‌ జాతీయ రాజకీయాలంటూ హడావిడి చేస్తున్నారని కొందరంటున్నారు. ఈ విషయం తెలిసే కొన్ని ప్రాంతీయ పార్టీలు కెసిఆర్‌ని దగ్గరకు రానీయలేదని అంటున్నారు. అందుకే కెసిఆర్‌ మెదట చేసిన థర్డ్‌ ఫ్రంట్‌ వ్యూహం బెడిసికొట్టిందని ఇక ఇప్పుడు జాతీయ పార్టీ అంటూ మరో ఎత్తుగడ వేసినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాదిలో బలంగా ఉన్న రైతు సంఘాలకు ఎనలేని ప్రధాన్యం ఇచ్చి వారితో రెండురోజులుగా సిఎం కెసిఆర్‌ చర్చించారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో రైతు ఒటు బ్యాంకు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సి వచ్చే పక్షంలో ఆ ఓటు బ్యాంకు అంతా ప్రధాన పోటీదారు వైపు మళ్ళకుండా కెసిఆర్‌ ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీ వైపు మళ్ళి మోడీ ప్రభుత్వానికి పరోక్ష మేలు చేయడమే కెసిఆర్‌ రైతు సంఘాలతో భేటీ వెనక ఉన్న ఎత్తుగడ అని కొందరంటున్నారు. అదేవిధంగా దళిత బంధు, రైతు బంధు, ఉచిత విద్యుత్‌ అంటూ ఉత్తరాదిలో మోడీ వ్యతిరేక ఓటు మరోవైపు మళ్ళించే యత్నమే తప్ప మరొకటి కాదంటున్నారు. ఎందుకంటే ఈమారు రాష్ట్రంలో ఒకవేళ హంగ్‌ వచ్చే పక్షంలో టిఆర్‌ఎస్‌కి రాష్ట్రంలో అధికారాన్ని అప్పచెప్పి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించే వ్యూహంతోనే అటు బిజెపి, ఇటు టిఆర్‌ఎస్‌ కలిసే రాజీకీయాలు చేస్తున్నాయనే వారు ఉన్నారు. రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్‌ని ఖతం చేస్తే ఇరువర్గాలకు ప్రయోజనంగా ఉంటుందనే ఆలోచనతోనే వ్యూహాత్మకంగా కెసిఆర్‌ బిజెపిపై ఎదురు దాడి, ప్రతివిమర్శలు చేస్తున్నారంటున్నారు. ఈడీ దాడులు, క్యాషినో వ్యవహారాలు, రాజాసింగ్‌ అరెస్ట్‌లు ఇలా చెప్పుకుంటూపోతే ఇటీవల జరిగిన ఉద్రిక్త రాజకీయ పరిణామాలన్నీ కేవలం బిజెపి, టిఆర్‌ఎస్‌ రాజీకీయాలేననే ప్రచారం ఉన్నది. ఈ ఇరువర్గాల పోరులో ఎటొచ్చి నలిగిపోయేది కాంగ్రెస్‌ పార్టీనేనని ఈ పరిణామం అటు కేంద్రంలో బిజెపికి ఇటు రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌కి మేలు చేస్తుంది. అంతే తప్ప దేశానికి ప్రధాని కెసిఆర్‌ అవుతారని కాదు..రాష్ట్రంలో బిజెపి అధికారం చేపడుతుందని కాదు. ఉన్నదల్లా ఒక్కటే కాంగ్రెస్‌ని ఖతం చేయడమే. అదేవిధంగా ఇంకో రాజకీయ ముందడగు వేయడానికే సిఎం కెసిఆర్‌ ఈ జాతీయ రాజకీయాలంటున్నారని కొందరంటున్నారు. మరో యేడాదిన్నర తర్వాత ఎన్నికలు జరుగుతాయి. ఈ పరిస్థితుల్లో మంత్రి కెటిఆర్‌ని ముఖ్యమంత్రిగా చేయడానికే కెసిఆర్‌ తెలివిగా జాతీయ రాజకీయాలంటూ ఒక గ్యాప్‌ని రాష్ట్రంలో సృష్టిస్తున్నారని కొందరంటున్నారు.అంటే నేను దేశ రాజకీయాల్లోకి వెళుతున్నా..నా అవసరం అక్కడ ఉన్నది..నా కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు..అందుకే నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళక తప్పడం లేదు..కావున ఇక్కడ ముఖ్యమంత్రిగా నా కుమారుడు కెటిఆర్‌ని చేయాలని అనుకుంటున్నా దీనికి మీరంతా మద్దతియ్యాలని కెసిఆర్‌ నుంచి ఏ క్షణంలో ప్రకటన వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కొందరు గట్టిగా వాదిస్తున్నారు. కావాలనే కెసిఆర్‌ రాష్ట్రంలో సిఎం పదవికి ఖాళీ ఏర్పర్చే సందర్భాన్ని అవకాశాన్ని సృష్టిస్తున్నారని అంతే తప్ప కెసిఆర్‌ జాతీయ రాజకీయమేమి సీరియస్‌ కాదంటున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న స్థానిక సమస్యలను పక్కదారి పట్టించి అందరి దృష్టి జాతీయ రాజకీయాల మీదనే మళ్ళేలా చేసే వ్యూహం కూడా ఇందులో ఉన్నదని మరికొందరంటున్నారు. ఇల అనేక వాదాలు, ప్రచారాలు కెసిఆర్‌ జాతీయ రాజకీయం మీద నడుస్తున్నాయి. అయితే ఇందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా..ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే కెసిఆర్‌ చేపడుతున్న జాతీయ రాజకీయ ప్రచారం ఆచరణకు వీలయ్యేపనికాదనే చెప్పవచ్చు. బిజెపేతర కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పోరాడటంలో వాస్తవికత ఉన్నదేమో కానీ బిజెపి, కాంగ్రెసేతర కూటమిలు ఏర్పాటు చేసి దేశానికి ప్రధానినవుతా అనే కెసిఆర్‌ మాటలు ఉట్టి రాజకీయ ఊకదంపుడు ప్రసంగాలుగానే చూడాలే తప్ప సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే లోక్‌సభలో సంఖ్యా బలం ఉండాలి. మరి ఇప్పుడు కెసిఆర్‌ లోక్‌సభ సభ్యుల సంఖ్యా బలం ఎంత? వచ్చే ఎన్నికల నాటికి నిలిచే సంఖ్యా బలమెంత? ఇవన్నీ బేరీజు వేసుకుని రాజకీయాలు చేయాలే తప్ప ఇంకోరకం ప్రచారాన్ని వ్యూహాత్మకంగా నెత్తిన ఎత్తుకుంటే ప్రజల్లో విశ్వసనీయత సన్నగిల్లే ప్రమాదం ఉన్నది. మొత్తం రాజకీయ ఉణికినే ప్రశ్నార్థకం మార్చే చరిత్రవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *