ప్రజల్లో ఉన్నదెవ్వరు?
టికెట్ల కేటాయింపులో ఈసారి కెసిఆర్ సర్వే మంత్రం
వైఎస్ జగన్ ఫార్ములా తెలంగాణలో అమలు?
కెసిఆర్ ఆలోచనతో మూడొంతుల సిట్టింగుల్లో వణుకు
లాబీయింగులు, ఇమేజ్‌లతో గట్టెక్కాలనేవారికి ఇబ్బందే
కెసిఆర్ మూడోసారి ముచ్చట తీరాలంటే ‘సర్వే’ మందు తప్పదా?
మూడోసారి కూడా అధికారాన్ని నిలబెట్టుకువాలనే పట్టుదల కెసిఆర్లో ఉన్నట్లుగా అంతర్గతంగా ఆ పార్టీ ముఖ్యనేతలు చర్చించుకుంటున్నారు.ఈ క్రమంలో ప్రతిపక్షాలను కోలుకోలేని దెబ్బతీయాలనే ఆలోచనతో ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనే చర్చ నడుస్తోంది.అందుకు తగ్గ కార్యాచరణను సిఎం కెసిఆర్ ఇప్పటినుంచే మొదలుపెట్టినట్లుగా కొందరు నేతలు అంటున్నారు. ఇమేజ్‌పరంగా కెసిఆర్‌తో సరిపోల్చగల నేతలు ప్రతిక్ష పార్టీల్లో కొరవడటం టిఆర్ఎస్ పాలిట వరంగా మారింది. రెండోసారి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందంటే కెసిఆర్ చరిష్మాతోనే అని అంటారు. అయితే ఇప్పుడు కూడా ఆ పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయని చెప్పలేం. రెండుసార్లు అధికారం చేపట్టిన తరువాత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. అది ఏ మోతాదులో ఉన్నదనే దాని మీద ఆధారపడి ఎన్నికల ఫలితాలుంటాయి. రాష్ట్రానికి సిఎంగా ఎవరుంటే బాగుంటదనే వ్యక్తిగత అభిప్రాయాల పరంగా వస్తే కెసిఆర్ ముందువరుసలో ఉంటారనేది కాదనేలి సత్యం. అయితే కెసిఆర్ వ్యక్తిగత ప్రభావాన్ని పక్కనపెడితే స్థానిక నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు అక్కడి ప్రజాప్రతినిధి పనితీరు కూడా పార్టీల గెలుపోటములను నిర్ణయిస్తుంది. వాస్తవానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కెసిఆర్ ఇమేజ్‌ని పక్కనపెడితే మూడొంతుల సిట్టింగు ప్రజాప్రతినిధులు ఇంటిదారి పడతారని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. ఈ పరిస్థితికి అనేక కారణాలున్నాయి. చాలామంది స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాల అమలులో దారుణంగా విఫలమయినట్లుగా తెలుస్తోంది. కేవలం కెసిఆర్ ఇమేజ్, పార్టీ బలంతో మనం గట్టెక్కుతామనే ఆలోచనలో చాలామంది సిట్టింగు శాసనసభ్యులున్నట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గాల్లో ఇప్పటికే చాలామంది సిట్టింగు ప్రజాప్రతినిధులు ప్రజల్లో పట్టుకోల్పోయారు. పార్టీలో కూడా అంతర్గతంగా ఇంటిపోరులో వీరిపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లుగా ఇప్పుడిప్పుడే వార్తలు వెలువడుతున్నాయి. వీటన్నింటికన్నా ముఖ్యంగా చాలామంది ప్రజాప్రతినిధులు సొంత లాభాలపైనే దృష్టి పెడుతూ ప్రజాసమస్యలను గాలికొదిలేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ పరిణామాలన్ని పార్టీకి చేటుచేస్తాయనే కలవరం కెసిఆర్లో ఉన్నట్లుగా కొందరు అంటున్నారు. ప్రతిపక్షాలను మట్టికరిపించి మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకుని తన సత్తా చాటాలనే కెసిఆర్ ఆలోచనను మూడొంతుల నియోజకవర్గాల్లో ఉన్న వ్యతిరేక పరిస్థితులు తలకిందులు చేసేలా ఉన్నాయి. ఈ పరిస్థితులను చక్కదిద్ది మూడోసారి ముచ్చట తీర్చుకోవాలంటే నియోజకవర్గాల్లో భారీ శస్త్రచికిత్స తప్పదనే ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. పక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో సిఎం జగన్ మాదిరిగా తెలంగాణలో కూడా అదే ఫార్ములా అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల పనితీరు అటు ఇంటా బయట ఎలా ఉన్నది? పార్టీకి గెలుపు గుర్రాలు ఎవరు? అనే ముఖ్య విషయాల మీద ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వైఎస్ జగన్ అంతిమంగా అదికారాన్ని అందుకోవడానికి కేవలం ఇలాంటి సర్వేలతోనే సాధ్యపడిరది. అసలు మొదటిసారే జగన్ పార్టీ వైసిపి అక్కడ అధికారంలోకి వచ్చి ఉండేది. కానీ పార్టీ టికెట్ల కేటాయింపుల విషయంలో వేసిన తప్పటడుగులు, లాబీయింగులతో జగన్‌ని కొందరు పక్కదారి పట్టించడంతో తృటిలో మొదటిసారి అధికారాన్ని అందుకోలేకపోయారు. అప్పుడు జరిగిన తప్పులను సరిచేసుకోవడానికి రెండోసారి జగన్ ప్రశాంత్ కిశోర్‌కి సర్వేల బాధ్యత ఇచ్చి నియోజవర్గంలో పార్టీలో బలమైన నేతల బలాబలాలను క్షేత్రాస్థాయిలో సర్వేల ద్వారా తెలుసుకుని ఎవరైతే గెలుపు గుర్రమో వారికే టికెట్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే ఫార్ములా మళ్లీ వచ్చే ఎన్నికల్లో కూడా ఉపయోగిస్తారని అక్కడి పార్టీ నేతలంటున్నారు. ఇప్పుడు కెసిఆర్ కూడా నియోజవర్గాల్లో ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు నమ్మకమైన ఎవరి ప్రలోభాలకు లొంగని సర్వేల ఆధారంగా తెలుసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా కొందరు రాజకీయ విశ్లేషకులంటున్నారు. లాబీయింగులను, ప్రలోభాలను పక్కనపెట్టి ప్రామాణిక క్షేత్ర స్థాయి సర్వేల ద్వారా నియోజవర్గాల్లో ఉన్న ముగ్గురు బలమైన నేతల పేర్లను తీసుకుని వారిపై ప్రజల్లో , పార్టీలో ఉన్న అభిప్రాయాల ఆధారంగానే ఈసారి టికెట్ల కేటాయింపులుంటాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. సరిగ్గా ఇప్పుడు జరుగుతున్న చర్చ కొందరు సిట్టింగులకు మింగుడుపడటం లేదు. సర్వేలతో ఎక్కడ తమ బండారం బయటపడుతుందోననే ఆందోళన చాలామంది సిట్టింగు శాసనసభ్యుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే పార్టీ టికెట్ వస్తే చాలు..కెసిఆర్, కెటిఆర్ అండదండలు, చరిష్మాతో బయటపడొచ్చనుకునే సిట్టింగు శాసనసభ్యులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కెసిఆర్ మదిలో సర్వేల ఆధారంగానే పార్టీ టికెట్లు అనే ఆలోచన ఉన్నదనే ప్రచారంతో ఇలాంటి వారందరి వెన్నులో వణుకు పుడుతోన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో సాధ్యాసాధ్యాల సంగతి ఎట్లున్నా మూడొంతుల సిట్టింగులకు స్థాన చలనం తప్పితేనే పార్టీ మూడోసారి గట్టెక్కుతుందనే ప్రచారం మాత్రం ఊపందుకున్నది. ఆ దిశగా కెసిఆర్ అడుగులు వేయాలని పలువురు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.